Bhagavad Gita - Ghantasala

We wish to extend our sincere appreciation to Ghantasala site for their comprehensive collection of resources, including the sacred verses of the Bhagavad Gita. While we have referenced their site, it is important to note that our intention was to highlight its existence and contribution to the dissemination of spiritual knowledge. We encourage our visitors to explore Ghantasala site https://www.ghantasala.info/bgeeta/geetar01-telugu.html independently and express their gratitude for its invaluable service in preserving and sharing the timeless wisdom of the Bhagavad Gita.

Bhagavad Gita Slokas Rendered By Ghantasala Garu

పరిచయ వ్యాఖ్యానం: శ్రీ వ్యాసభగవానుని విరచితమైన శ్రీ మత్భగవత్గీత లో మొత్తం, 18 అధ్యాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. వాటి సారాంశాన్ని, కూర్చీ, కుదించి మనకు సులువుగా గీతా సారాంసాన్ని అందించే, 100 శ్లోకాల ఎంపిక చేసి , వాటి తాత్పర్యమను మన కందినచిన వారు: శ్రీ కె. ఎస్. రంగయ్య శాస్త్రి గారు. ఆ శ్లోకాలు పద్మశ్రీ ఘంటసాల గారు ఆలాపించి, ఫలశృతి, మంగళసాసన శ్లోకాలతో కలిపి, తాత్పర్య సహితముగా తన గానామృతముతో భక్తి వేదాంత భావాలు తొణికిసలాడిస్తూ మనందరికీ ప్రసాదించారు. మొదటి భాగము


001     పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
            వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్
            అద్వైతామృతవర్షిణీం భగవతీమ్ అష్టాదశాధ్యాయినీం
            అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్

భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి.

002     న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
            కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా (01:32)

స్వజనమును చంపుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీ కృష్ణ పరమాత్మ:

003     అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
            గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః (02:11)

దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.

004     దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
            తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న మూహ్యతి      (02:13)

జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

005     వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి
            తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహీ      (02:22)

మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో, అట్లే, ఆత్మ - జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.

006     నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః
            న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః      (02:23)

ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనములేనిది.

007     జాతస్య హి ధ్రువో మృత్యుః ద్రువం జన్మ మృతస్య చ
            తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి      (02:27)

పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.

008     హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్
            తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః      (02:37)

యుద్ధమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా, యుద్ధమును చేయ కృతనిశ్చ్యుడవై లెమ్ము.

009     కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
            మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోఽస్త్వకర్మణి      (02:37)

     కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితము పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని, కర్మలను చేయుట మానరాదు.

010     దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
            వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే      (02:56)

దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినపుడు స్పృహ కోల్పోని వాడును (సుఖములు కలిగినపుడు స్పృహ లేనివాడు), రాగమూ, భయమూ, క్రోధమూ పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును.

011     ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
            సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోదో భిజాయతే      (02:62)
            క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్ స్మృతివిభ్రమః
            స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి      (02:63)

విషయ వాంచలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

012     ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి
            స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి      (02:72)

ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.

013     లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ
            జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్      (03:03)

అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.

014     అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః
            యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః      (03:14)

అన్నమువలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.

015     ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః
            అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి      (03:16)

పార్థా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి, ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాప జీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మల నాచరించుచునే యుండవలెను.

016     యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
            స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే      (03:21)

ఉత్తములు అయినవారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరింతును.

017     మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా
            నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః      (03:30)

అర్జునా! నీవొనర్చు సమస్త కర్మలనూ నాయందు సమర్పించి, జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై, సంతాపమును వదలి యుద్ధమును చేయుము.

018     శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్
            స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః      (03:30)

చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మముకన్న, గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.

20     ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ
            యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్      (03:38)

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లే కామముచేత జ్ఞానము కప్పబడియున్నది.

019     యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
            అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం      (04:07)

            పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
            ధర్మసఁస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే      (04:08)

ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మసంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.

Post a Comment

0 Comments